అనాథ
అందమైన ప్రాయాన్ని
అవసరానికి అమ్ముకుని
ఆకలి తీర్చింది అమ్మ!
ఆకలైతే తీరింది
అనంత శోకం మిగిలింది!
పాడుబడ్డ రోగమేదో కాళరాత్రై
చల్లటి చందమామను కసిదీరా కబళించింది
అమ్మ అగుపడని లోకాలకు వెళ్లి పోయింది !!
అప్పట్నించి...
చిప్పిరి జుట్టూ, చీమిడి ముక్కూ
చిరిగిన గుడ్డలూ
ఇవే నా లేటెస్ట్ ఫాషన్
మండుటెండలు, కడుపుమంటలూ
ఎండమావులూ,గుండెకోతలూ
నను వీడని నీడలు
గజ్జి కుక్కలూ, 'గలీజు పోరలు'
'ఉడా' పెంచిన గడ్డిమొక్కలూ
నాకు దోస్తులు
పిడికెడు కూడూ, సరిపడు గూడూ
వదలని తోడూ
నా కోరికలు
వెకిలి నవ్వుల వెక్కిరింపులూ
చీదరింపులూ, ఛీత్కారాలూ
నేనడగని సత్కారాలు
వసంత కాలపు వికసించిన విరులూ
సమస్త ప్రాణుల సంరక్షించే ప్రభువూ
తిమిరముకావలి భానూదయాలూ
నను నడిపిస్తున్న వెలుగు దివ్వెలు
(1999)
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
This one if very nice too!
Post a Comment