Sunday, February 09, 2025

‘అరణ్యను’ గాచి అస్తమించిన వెన్నెల!

(A review of the movie Virataparvam directed by Venu Udugula garu)
    

సాధారణంగా విషాదాంత ప్రేమ కథా చిత్రాలలో ప్రేమికులు విడిపోవడానికి వ్యక్తులో, పరిస్థితులో కారణమవుతాయి. ఆ విరహ వేదనను సహానుభూతి చెందడం వల్ల అటువంటి కథలు మన మనసును మెలిపెడతాయి. అందుకే ఆ అనుభూతి కేవలం చిత్రాన్ని చూసినంత వరకే కాకుండా ఇంకొంత కాలం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. విరాట పర్వం కూడా ఒక విషాదాంత ప్రేమకథా చిత్రం. పద్దెనిమిది ఏళ్ల వయసులో ఇల్లు కల్పించే భద్ర జీవితాన్ని, తనను అమితంగా ఇష్టపడే తండ్రిని, తల్లిని విడిచి, దిన దిన గండంగా, అనుక్షణం అనూహ్య పరిస్థితుల మధ్య అనేక అడ్డంకులను దాటుకుంటూ తాను ప్రేమించిన వ్యక్తిని చేరుకుని ఆ ప్రేమ అనే సూర్యుడి కిరణాల ప్రసారంతో శోభాయమానంగా వెలుగుతున్న వెన్నెల అనుకోని పరిస్థితుల్లో అదే ప్రేమికుడి చేతుల్లో హతమయి ప్రేక్షకుల గుండెల్ని బరువెక్కించి, మనసులను చీకటితో నింపే చిత్రం.

ఈ చిత్ర కథ చిత్రం విడుదలకు ముందే అందరికీ తెలిసిపోయింది. మీడియాలో దానికి సంబంధించిన కథనాలు వచ్చాయి. కథ ముందే తెలియడం వల్ల కథనం, సంభాషణలు, స్క్రీన్ప్లే, సినిమాటోగ్రఫీ, నటీనటుల అభినయం అన్నీ బాగుంటేనే ఆ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అన్ని క్రాఫ్ట్స్ ని గొప్పగా సమన్వయం చేయడంలో దర్శకుడు విజయం సాధించాడు.



ఒక నక్సలైట్ రచనలను చదివి ప్రభావితమయ్యి అతణ్ని ఆరాధించడం మొదలుపెట్టిన పద్దెనిమిదేళ్ల అమ్మాయి తన తండ్రిని శారీరకంగా గాయపరిచి, అవమానించిన వారిని అతడు కొట్టి హతమార్చడంతో ప్రేమిస్తుంది. తండ్రి చెప్పిన మీరాబాయి ఒగ్గు కథ అతడి కోసం ఇల్లు విడిచి వెళ్ళేలా చేస్తుంది. ఆ తర్వాత తన ప్రియుడిని చేరుకోడానికి ఆ అమ్మాయి చేసే ప్రయాణం పొడవునా విడిచిన పాదముద్రలు కథ చివరలో తనను దోషిగా నిలబెట్టే సాక్ష్యాలకు బీజాలుగా పరిణమిస్తాయి. ఈ సహజమైన సన్నివేశాల కల్పన, దానిని తెరకెక్కించిన విధానం, చక్కటి సంభాషణలు ప్రేక్షకులను ఈ కథలో లీనమయేటట్లు చేస్తాయి. దర్శకుడు ఎంతటి ప్రతిభావంతుడో తెలుపుతాయి. ప్రతీ సన్నివేశం వెన్నెలను రవన్నకు మరింత దగ్గరగా చేర్చుతుంది. శారీరకంగా, మానసికంగా.. అట్లే ఆమె మరణానికి కూడా!

దర్శకుడు అనేక సన్నివేశాలలో సూక్ష్మంగా అనేక విషయాలు చెబుతాడు. నాకు బాగా నచ్చిన కొన్ని:

-- రవన్నను చూసిన తర్వాత కృష్ణుడి నకాశి బొమ్మకు వెన్నెల మీసాలు అద్దుతుంది. తన కృష్ణుడికి మీసాలు ఉన్నాయి కాబట్టి బొమ్మకు కూడా పెట్టి మీరాబాయి అయిపోతుంది వెన్నెల.

-- మొట్టమొదటి సారి రవన్న కవిత్వం చదువుతున్నపుడు వెన్నెల ‘కిటికీలను తెరుస్తుంది’. ఒక కొత్త ప్రపంచపు తాలూకు వెలుగు ప్రసరిస్తుంది. ఆ కిరణాల వెలుతురులో పుస్తకం చదువుతుంది. ‘రవి’ ‘వెన్నెల’ జీవితంలోకి ప్రవేశించినట్టుగా సూచిస్తాడు దర్శకుడు. Symbolism!

-- వెన్నెల ఇంట్లో పాండురంగడు (విఠోబా, కృష్ణుడు), రుక్మిణిల చిత్రపటం ఉంటుంది. తెలంగాణలో చాలా ప్రాంతాలలో విఠోబాను కొలుస్తారు.

-- వెన్నెల రవన్నను కలవడానికి వెళ్తున్నపుడు, శకుంతల టీచర్ వాళ్ళింట్లో You were destined for me, perhaps as a punishment! అనే కొటేషన్ దాస్తొయెవ్‌స్కీ ఫోటోతో కనిపిస్తుంది.

-- చావుకేకలు ఎప్పుడైనా విన్నావా అని రవన్న గద్దిస్తే ఏడేళ్లుగా నీ కోసం ఎదురుచూస్తున్న నీ అమ్మ ఏడుపులో విన్నాను అని చెబుతుంది వెన్నెల. ఇది వెన్నెల, రవన్నల దృక్పథాలలోని వైరుధ్యాన్ని చెప్పే అద్భుతమైన డైలాగ్.

-- సినిమా మొత్తం తెలంగాణ మండలికం authenticగా వినిపించడంలో దర్శకుడి అవగాహన, శ్రద్ధ కనబడుతుంది. చిన్నారి వెన్నెల కృష్ణుడి బొమ్మకోసం బావిలోకి దిగితే ఒక అమ్మ ‘వామ్మో గీ పిల్లకు గింత మొండితనం ఏంది చెల్లె..’ అనడం, రవన్న దళం ఊర్లోకి వచ్చినప్పుడు ‘నీయక్క రవన్న దళం అచ్చిందిరా’ అని ఒక గ్రామస్థుడు అనడం ఎంత సహజంగా ఉన్నాయో తెలంగాణ పల్లెల్లో ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది.

-- వెన్నెల చనిపోతుందని తెలిసినా ఆ చావుకు దారితీసే ప్రతీ సన్నివేశంలో వెన్నెల మరో దారిలో ప్రయాణించాలని ప్రేక్షకుడు కోరుకునేలా ఆ సన్నివేశాలు రక్తి కట్టిస్తాయి. ప్రేక్షకులను రసానుభూతికి లోనయ్యేట్లు చేస్తాయి. అక్కడ జరుగుతున్నది వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన కల్పిత కథ. అయినా ఆ పాత్ర తీసుకునే నిర్ణయాలు, ఆమె మొండితనం పైన కోపం, జాలి ఒకేసారి కలిగేలా చేస్తాడు దర్శకుడు.

అసలు ఇటువంటి razor sharp కథాంశంతో సినిమా తీయడమే ఒక సాహసం. ‘వరల్డ్ సినిమా’ అంటూ మనం అభిమానించే సినిమాల స్థాయికి తగ్గది ఈ సినిమా!

ఈ సినిమాలో ఛాయాగ్రహణం ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉన్నది. తెలంగాణ గ్రామీణ నేపథ్యం, ఆ ఇళ్ళ నిర్మాణం – ముఖ్యంగా దర్వాజలు, కిటికీలు, ఇంటి మధ్య పైకప్పు తెరచి ఉండడం, ఆ వర్షంలో నానడం, గుట్టలు, అడవులు, జలపాతాలు.. ప్రతీ సన్నివేశం ఒక విజువల్ పోయట్రి! ఆ లైటింగ్ కి, షాట్స్ కి ఎంతగా కష్టపడి ఉంటారో ఊహించుకోవచ్చు.

ఇప్పటికే ఎందరో చెప్పినట్లుగా ఇది ‘సాయి పల్లవి సినిమా’. నేను చూసిన సాయి పల్లవి సినిమాలలో ఇది అత్యుత్తమమైనది. ఆమె నటనా పటిమకు, విస్తృతికి ఈ సినిమా ఒక తిరుగులేని ఉదాహరణ. రవన్న పుస్తకాలు చదివిందని తన స్నేహితురాలిని ఆమె బాపు ‘పొట్టు పొట్టు’ తిడితే ఆ పుస్తకాలు తనకు ఇవ్వమని అడుగుతుంది వెన్నెల. ఆ స్నేహితురాలు పుస్తకాలు తీసుకువచ్చే సమయంలో ఇంటి బయట ఎదురుచూస్తూ ఇచ్చిన expression superb! అప్పటికి రవన్న విప్లవ కవిత్వం తనకు పరిచయం కాలేదు. ఒక 18 ఏళ్ల యువతికి ఆ వయసులో సహజంగా ఉండే శారీరక ఉద్రేకల తాలూకు భావోద్వేగాలు అక్కడ కనిపిస్తాయి. పోలీసులు frisk చేసినప్పుడు వెన్నెల body language చూపరుల వంటిపైన కూడా జెర్రులు పాకిస్తాయి. వెన్నెల తండ్రిని చివరిసారి కలిసినప్పుడు ఆమె evoke చేసిన భావోద్వేగం, రవన్న తల్లికి తాను ఆమె కోడలినని చెప్పి ‘ఈ ముచ్చట ఇంకా నీ కొడుక్కి తెలవదు’ అన్నపుడు ఆమెలోని చిలిపితనం, తన ప్రేమలోని స్వచ్ఛతను గురించి శకుంతల టీచర్ ని ఒప్పించే ప్రయత్నంలో సాయి పల్లవి అభినయం గొప్పగా ఉంది. గ్రెనేడ్ విసిరి ఉరికే ఒక సన్నివేశంలో ఆమె body language నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇది కేవలం నటనను ‘నేర్చుకుంటే’ వచ్చేది కాదు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలి. సాయి పల్లవి వెన్నెలగా మారాలి. మారింది. అందుకే సినిమా ఇంతగా హృదయాన్ని హత్తుకుంది.

రవన్నగా రాణా నటన పాత్రోచితంగా ఉంది. తన తల్లిని కలిసిన సన్నివేశంలో, క్లైమాక్స్ లో subtle expressions ఆయన నటనలోని పరిణతిని చూపించింది. శకుంతల టీచర్ గా నందితా దాస్ సరిగ్గా సరిపోయారు. వెన్నెల మరణం తర్వాత టైపు రైటర్ మీద టైపు చేస్తూ ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అద్భుతం. వెన్నెల పైన ప్రేమ, అప్పటి రాజకీయ పరిస్థితులపైన అసహనం, ఆమె మరణం పట్ల దుఃఖం, జరిగిన తప్పుపై పశ్చాత్తాపం, తన గతం పట్ల nostalgia.. అన్నీ ఒక్క పది సెకన్లలో మనకు కనిపిస్తాయి.

ఈ సినిమాను భావజలాల ఘర్షణగా చూడవచ్చు. కానీ ఆ చర్చ చేయడానికి రెండు వాదనలను అర్థం చేసుకునేంత పరిపక్వత, ఆనాటి తెలంగాణ ప్రాంతపు సంక్షుభిత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన అవసరం. అది ఒక సగటు ప్రేక్షకుడిగా నాకు లేదు కాబట్టి నేను దీన్ని ఒక సినిమాగానే చూశాను. అందుకే నాకు ఇది వెన్నెల పాత్రను అమితంగా ప్రేమించిన ఒక వ్యక్తి ఆరాటంగా కనిపించింది. వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా, ఒక సంస్థ ప్రయోజనం ముఖ్యమా అంటే సత్యం ముఖ్యమని అది ఎవరివైపున్నదో ఆ వైపే నేనుంటానని చెప్పినట్టుగా అనిపించింది. అందుకే ఉద్యమంపై సానుభూతి ఉన్నప్పటికీ వెన్నెలకి జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేని ఒక సాధారణ వ్యక్తి దర్శకుడిగా తెలిపిన నిరసనలా నాకు అర్థమయ్యింది. ‘సత్యాన్ని సత్యంగా చూడలేని moral dilemma’ గురించి మాట్లాడటం... శాంతి తుపాకి గొట్టంలో కాదు, అమ్మాయి ప్రేమలో ఉందని రవన్న తల్లిచేతనే చెప్పించడం.. ఆ ప్రయత్నంలోనే భాగమనుకుంటాను.

ఇక చివరి సన్నివేశం.. తనని ‘ద్రోహం’ చేసిందని అనుకోడానికి తగినన్ని కారణాలున్న వ్యక్తి, తన ప్రేమను గుర్తించకపోడానికి, పైగా అనుమానించడానికి ఏ కారణం ఉందో అర్థంకాని వ్యక్తిని ఒక పెద్ద కొండపైన కాల్చితే ఆమె అక్కడనించి కిందకు పడిపోతుంది. కాల్చిన వ్యక్తి పాదాలు నీటిని చీల్చడం చూపిస్తాడు దర్శకుడు. తన కాళ్ళతో ‘వెన్నెల’ను నలిపేశాడు అనే అర్థమా!? ఆ తర్వాత నిజం తెలుసుకున్న రవన్న ఉరుకుకుంటూ ‘కొండ దిగి’ ఆమెను ఆలింగనం చేసుకుంటాడు. పశ్చాత్తాపపడతాడు. అప్పుడు కెమెరాను పైపైకి తీసుకెళ్ళి వాళ్ళు ఎంత అథఃపాతాళంలో ఉన్నారో చూపించి దర్శకుడు తన కోపాన్ని ప్రకటించుకున్నట్టు నాకు అనిపించింది.

వెన్నెల ‘అరణ్యను’ గాచి వృథా అయిందని చెప్పాడా!? 

No comments: