Sunday, February 09, 2025

'భర్త డే' - కథ

(Short Story. Wrote in 2014)

‘మేడమ్, మీరు మొన్న కార్ లోన్‌కి అప్లయ్ చేసుకున్నారు కదా... మీకు లోన్ సాంక్షన్ అయ్యింది’

టెండూల్కర్ 199వ మ్యాచ్ మధ్యలో హిందీ భాషలో వస్తున్న వ్యాపార ప్రకటనను చూస్తోంది మృదుల... సోఫాలో రాఘవ్ పక్కన కూర్చొని.

ప్రకటనలోని యువతి తన భర్త వైపు ఏమిటిది అన్నట్టు చూస్తుంది.

‘రేపు మీ పుట్టిన రోజు కదా... హ్యాపీ బర్త్‌డే మేడమ్...!’

‘సర్ప్రైజ్...!!!’ అంటాడు టీవీ ఆడ్‌లో యువ భర్త.

‘ఉండే..!’ నోటిని, పెదాలను వింతగా పెట్టి కొంత గర్వంతో... సర్ప్రైస్ ముందే తెలిసిపోవడంతో కొంచెం నిరాశతో... యువ భర్త స్పందన.

యువతి మొహం సంతోషంతో, కళ్ళు నీళ్ళతో నిండిపోతాయి.

అంతే స్థాయిలో ఎక్సైట్ అయ్యింది మృదుల.

అప్రయత్నంగానే ‘అబ్బ...’అన్నది.

పక్కనే కూర్చున్న రాఘవ్ దాన్ని పట్టించుకున్నట్టు కనిపించలేదు. తరువాతి ఓవర్‌ని చూస్తూ ఏ విధమైన స్పందన బయటకి రానివ్వలేదు.

కళ్ళతోనే కసురుకుంది మృదుల. ‘ముద్దపప్పు...’ శబ్దంలో చెబితే దానర్థం అది. అయితే ఆరోజు అట్లా తిట్టడం అదే మొదటిసారి కాదు.

ఒక్కరోజులో పెళ్ళాంతో ‘ముద్దపప్పు’ అని తిట్టించుకోవడం అనే క్యాటగిరీ కింద అతనికి ఈజీగా గిన్నిస్ బుక్‌లోకి ఎంట్రీ దొరుకుతుంది.

ఎందుకంటే ఆ రోజు మృదుల పుట్టినరోజు. పెళ్ళైన తర్వాత రెండవది. ఒక్కసారి గతంలోకి వెళ్ళిపోయాడు రాఘవ్.

***
‘మీకు తిక్క... ’ నిశ్చితార్థానికి కొద్ది రోజులముందు తన ఫియాన్సీని అలా తిట్టడం కొంచెం సాహసమే... కొంచెం కాదు... వాళ్ళలాంటి సోకాల్డ్ సాంప్రదాయ కుటుంబాల్లోనయితే చాలా పెద్ద సాహసం... అయినా తిట్టింది మృదుల.

కారణం... రాఘవ్ పుట్టినరోజు నాడు తనను కనీసం ‘విష్’ చేయకపోవడం...

అవును మరి... పెళ్ళి నిశ్చయం కాగానే వచ్చింది... ఎంతో ప్రత్యేకమైంది... ఎన్నో అంచనాలు, లెక్కలు వేసుకుంది మృదుల.

బంధువులూ, స్నేహితుల గుచ్చి గుచ్చి అడగడం సరేసరి... తమ జీవితాలను పూటకో పంచాయతీ, రోజుకు నాలుగు సర్దుబాట్లతో గడిపేవారు పక్కవాళ్ళ పెళ్ళాలకు, మొగుళ్ళకు వాళ్ళ వాళ్ళ పెళ్ళాలు, మొగుళ్ళు (కాదు కాదు మొగుళ్ళు ముందూ పెళ్ళాలు తర్వాత...!) ఏం కానుకలు ఇచ్చారు... ఎలా విష్ చేసారు... ఎలా బర్త్‌డే, మ్యారేజ్‌డేలను ‘ఎంజాయ్’ చేసారు అని ఆత్రుత పడడం నిజంగా మనోవైజ్ఞానిక విశ్లేషణలకు అత్యంత పోటెంట్ వస్తువనిపిస్తుంది.

నిజానికి మృదుల ఈ ప్రభావాలకు కొంచెం దూరం... అయితే పొద్దట్నించీ ఎదురుచూసింది తమ పరిచయంలో మొదటి పుట్టినరోజు కదాని. ఏ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడోనని ఎదురుచూసిన తనకు రాత్రి తొమ్మిదవుతున్నా అసలు విష్ కూడా చేయకుండా షాకిచ్చాడు.

చూసీ చూసీ... ఇక లాభం లేదనుకొని మెసేజ్ పెట్టింది...

‘ఇవ్వాళ నా పుట్టినరోజు... మీకు గుర్తుందనుకుంటాను...’

అయినా సమాధానం లేదు... భరించరాని మరో గంట సమయం...

ఓపిక నశించి ఫోన్ చేసింది... ఓ వంద సార్లు... రాఘవ్ ఆన్సర్ చేయలేదు... హండ్రెడ్త్ టైమ్ లక్కీ...!

‘ఏం బాబూ... అంత బిజీనా... కనీసం బర్త్‌డే రోజు గ్రీట్ చేసే తీరిక, ఓపిక కూడా లేదా మీకు?’ ఆమె గొంతులో కోపం పలకలేదు... ఆర్తి మాత్రమే ధ్వనించింది.

తన సర్వస్వం కాబోతున్న వ్యక్తి తన పుట్టినరోజును కూడా పట్టించుకోక పోవడం ఆమెకు మింగుడు పడడంలేదు.

గుండే సంద్రమయ్యి కంటినుండి పొంగుతోంది... సరిగ్గా వంద కిలోమీటర్ల దూరంలో ఏకాంతంగా ఉన్న రాఘవ్ కి ఆ విషయం తెలుస్తూనే వుంది...

ఆమె సున్నితత్వానికి తన మనసు ఉప్పొంగింది... కిలోమీటర్లు కరిగిపోయాయి... నిశ్శబ్దంలోనే ఆమె మనసును హత్తుకున్నాడు.

అవును తనది క్షమించరాని తప్పు... పుట్టినరోజు బహుమతిని ఆశించడం చాలా సహజం... బహుమతి కాకపోతే కనీసం కొన్ని తియ్యటి మాటలు... అందులో పెళ్ళితో త్వరలో ఒక్కటవబోతున్న జంటకు ఎన్ని విషయాలుంటాయి మాట్లాడుకోటానికి... కానీ తను పూర్తి భిన్నంగా... అది నమ్మకద్రోహం...

కానీ... తనకు కారణం ఉంది... అదే రోజు తన పెదనాన షష్టి పూర్తి కావడంతో రోజంతా నిజంగానే బిజీగానే ఉన్నాడతను... ఏదో మొక్కుబడిగా విష్ చేసి ఉండొచ్చు... కానీ అది తన నైజం కాదు... అన్‌డివైడెడ్ అటెన్షన్ యివ్వాలనుకున్నాడు... అందుకే ప్రత్యక్షంగానే కలుద్దామనుకున్నాడు...

కానీ వీలు పడలేదు...

అది అతన్ని నిరాశపరచింది. అనుకున్నది అనుకున్నట్టు కాకపోతే అంత త్వరగా కోలుకోలేడతను. ‘ప్లాన్‌ బీ’ అంటే అతనికి అసహ్యం. అతని పర్సనాలిటీలో అతి పెద్ద సమస్య అదే. ఎయిమ్ ఫర్ ద స్టార్స్... యూ విల్ అట్‌లీస్ట్ లాండ్ ఆన్ ద మూన్... అని సామెత. కానీ తనకు మాత్రం చుక్కలను తాకాలనుకొంటే తాకాల్సిందే... తక్కువ దేనికీ అంగీకరించడు... స్వీకరించడు.

ఆ రోజు కూడా అదే జరిగింది. మృదుల పుట్టినరోజు కోసం ముందే షాపింగ్ చేసి గ్రీటింగ్ కార్డు, గిఫ్ట్ కొన్నాడు. కాని అనుకోని అవాంతరం రావడంతో తన వద్దకు వెళ్ళలేక పోయాడు. అది అతన్ని బాధించింది. తను అనుకున్నట్టు ప్రత్యక్షంగా వెళ్ళలేనపుడు ఫోన్లో శుభాకాంక్షలు చెప్పడం అనవసరం అనుకున్నాడు. అందుకే తను ఫోన్ చేయలేదు... అదే చెప్పాడు... అందుకు ప్రతిగా అందుకే ఆమె నుండి సత్కారంగా ‘తిక్క’నిపించుకున్నాడు.

అప్పటికి రాత్రి పదకొండున్నరయ్యింది. వివరణ యిచ్చిన తర్వాత గుండె తేలికయ్యిందతనికి. ఇద్దరూ మరో రెండున్నర గంటలు తేలిక పడ్డ గుండెల్ని తమ మాటల ద్వారా విరహంతో నింపుకొని మళ్ళీ బరువు చేసుకున్నారు. ఇప్పుడు దూరం మరింత భారం అయ్యింది. ఒక్కసారిగా కలుసుకొని శరీరాలను ముడివేసుకోవాలన్న ఆవేశం... మనసులెలాగూ ముందే ముడి పడి పోయినయి.

‘అయినా రేపు ఉదయం వరకు బర్త్‌‌డే అన్నట్టే... నన్నెవరూ అర్దరాత్రి 12 గంటలకు విష్ చేయరు...’

ఒక్కసారిగా జ్ఙానోదయమయినట్టు లేచాడు రాఘవ్.

అప్పటికి రెండయ్యింది. ‘సరే సరే... ఉంటా... బై బై...’ అని అర్ధంతరంగా ఫోన్ పెట్టేసాడు. తన ఆగానికి మళ్ళీ విస్తుపోయింది మృదుల.

కాసేపు ఆలోచించాడు. తనను సూర్యోదయం లోపల కలవాలని నిశ్చయించుకున్నాడు.

ఒక గంట ఆగి బయల్దేరాలనుకున్నాడు. నడము వాల్చాడు. ఎంతకీ రెప్ప అంటుకోదు. గంట గడవడం గగనమయ్యింది.

మూడింటికి తన కజిన్‌తో కలిసి బయల్దేరాడు. నవంబరు నెల. చలి విపరీతంగా ఉంది. వంద కిలోమీటర్ల దూరం. బైక్‌పై ప్రయాణం.

నేషనల్ హైవే నెంబర్ 7. డెబ్బై కిలోమీటర్ల తర్వాత గతుకుల, అతుకుల రోడ్డు. మొత్తానికి రెండు గంటల్లో గమ్యం చేరుకున్నాడు.

అప్పటికే నిద్ర లేచి పని మనిషికి అంట్ల గిన్నెలను వేస్తోంది మృదుల. సుఖనిద్ర తర్వాత ఫ్రెష్‌గా ఉంది సహజంగా... చలికాలం ఉదయపు మంచుకు తడిసి సూర్యకాంతిలో తళతళా మెరిసే చిగురుటాకులా... దూరంనుంచే నిశ్శబ్దంగా గమనిస్తున్నాడు... కాదు... ఆమె అందాన్ని ఆస్వాదిస్తున్నాడు.

తన శరీరంనుండి ఏవో తనని విడిపోతున్న ఫీలింగ్‌‌తో చుట్టూ చూసింది మృదుల. ఎదురుగా రాఘవ్...!!!

గుండె కిందకీ పైకీ ఓ పదిసార్లు జారీ, లేచి కుదుటపడటానికి కొన్ని నిమిషాలు పట్టింది. నోరు విప్పార్చి బొమ్మలా నిలబడింది. కాలం అట్లాగే ఫ్రీజ్ అయితే బాగుండనుకున్నాడు రాఘవ్. ఏ చిత్రకారుడు, శిల్పకారుడూ కనీసం దరిదాపులకు కూడా వ్యక్తీకరించలేని అత్యంత సహజమైన సౌందర్యం అది. క్రుత్రిమ సాధనాలకు అందని ఆ సౌందర్యాన్ని తన కళ్ళద్వారా గుండెలోపల శాశ్వతంగా ప్రతిష్టించుకున్నాడు.

‘హ్యాపీ బర్త్‌డే...!!!’

వెంట తెచ్చిన గ్రీటింగ్ కార్డు, గిఫ్ట్‌ను యిస్తూ విష్ చేసాడు. ఆమె కంటినుండి జారిన రెండు చుక్కలు ‘థాంక్స్‌’ చెప్పాయి. మేమూ చెబుతాం థాంక్స్ అంటూ ముందకు వస్తున్న పెదాలను ఎలాగోలా ఇద్దరూ నియంత్రించారు చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రోద్బలంతో...

ఉదయిస్తున్న సూర్యుడి కాంతి పడ్డ ఆమె మొహం చంద్ర బింబంలా నిండుగా ప్రకాశిస్తోంది. అనిర్వచనీయమైన అనుభూతి పొందిన మనసు అభివ్యక్తీకరణ అది... అప్పుడు ఆరయ్యింది...

***

సాయంత్రం ఆరవుతోంది... మెల్లగా మృదులలో బర్త్‌డే ఉత్సాహం ఆవిరవుతోంది...

ఏమిటితను? పొద్దట్నించీ ఇంట్లో తన తోనే ఉంటాడు... తనముందే కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు శుభాకాంక్షలు చెబుతుంటే పక్కనే ఉంటాడు... పల్లెత్తు మాట మాట్లాడడు... చిరునవ్వులు కురిపిస్తాడు...

తనే ఫలానా వాళ్ళు ఫోన్ చేసారని చెప్తే ‘ఓహో అవునా...’ అంటూ ముక్తసరిగా అంటాడు.

నిజంగానే వీడికేమన్నా తిక్కా...? వీరు... ఈయన... వీడు అనే పదాలు ఆడవారి కోపం స్థాయికి సమాంతరంగా, అనులోమంగా ప్రయాణిస్తాయి. ‘వీడు’ వరకు మ్యాటర్ వచ్చిందంటే మాటల యుద్ధానికి మిల్లీ మీటర్ దూరం వరకు వచ్చినట్టే.

మామూలు రోజుకీ ఈ పుట్టినరోజుకీ ఏం తేడా...? కాదు కాదు ఏం ప్రత్యేకం...?

పొద్దున్న ఆరింటికే లేచి ఓ అరగంట తలస్నానం చేసి తనకు ఇష్టమైన చీర కట్టుకుని, తనకు నచ్చినట్టు తయారయ్యి, తనకు నచ్చిన వంటలు చేసింది. ఇక్కడ తనకు అంటే రాఘవ్ కని అర్థం. అసలు బర్త్‌డే నాదా తనదా...? తనలో తనే ప్రశ్నించుకుంది.

తొమ్మిదింటికి దగ్గరలోని వెంకటేశ్వరాలయంకు పోయి మొత్తం కుటుంబం పేర అర్చన చేయించడం... గుళ్ళో కాసేపు వెంటవచ్చిన తన అన్నతో కలిసి ఏవో జనరల్‌ ముచ్చట్లు పెట్టడం... ఇంటికి వచ్చి మళ్ళీ భోంచేయడం... కష్టపడి (మృదుల) చేసిన ఇష్టమైన (రాఘవ్ కి) వంటలను ఏమాత్రం కష్టపడకుండా (రాఘవ్) సుష్టుగా (మళ్ళీ వాడే) తినడం (మనసులో మెక్కడం అనే అనుకుంది)... తినడం, తాగటం, వాగడం కాకుండా అంటే ఫేస్‌బుక్, తెలంగాణ, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్, క్రికెట్ మ్యాచ్...

ఏముంది స్పెషల్ ఈ రోజు...? అంతా రొటీన్... ఇంకా మాట్లాడితే రోజుకంటే ఎక్కువ పని, అలసట.

తనకు నచ్చినవి చేయడం నాకు నచ్చుతుంది... కాబట్టే చేసానివన్నీ.... కానీ నాకు నచ్చిన ఆ ఒక్క పనీ తను చేయడేం...? తనను దగ్గరకు తీసుకుని ఒక్కసారీ ‘హ్యాపీ బర్త్‌డే ’ అనడేం...? ఇది తనంటే పట్టింపు లేకపోవడమా...? లేదా విషెస్ చెప్పకుండా నన్ను ఆట పట్టించడమా...? అయినా మిసెస్‌కు విషెస్ చెప్పని ఏ స్పీషీస్ వీడిది...? అబ్బ... దీనికి రైమింగొకటి.... వీడి ఫ్రెండెవడో తన పెళ్ళానికి ఐ-ఫోన్ కొనిపెట్టాడట... సిగ్గులేకుండా మళ్ళీ వాడి ఫేస్‌బుక్‌ అప్‌డేట్‌ని తనే చూపించాడు... ఐ-ఫోన్ మన బతుక్కి... కనీసం ఉన్న ఫోన్‌కి తన డొక్కు ఫోన్‌నుంచి ఓ మెసేజ్ గతి లేదు... వీడి కంటే పదేళ్ళు చిన్నవాడు ఆ శీను, పూజాకి బర్త్‌డే రోజు ఎంత సర్ప్రైజ్ ఇచ్చాడు... మా విక్రాంత్ వాడి భార్య పుట్టిన రోజు ఫేస్‌బుక్‌ వాల్ అంతా ఎంతటి సందడి చేసాడు... సినిమాలు, షికార్లు, పార్టీలు, హోటల్లో డిన్నర్లు, ఎగ్జిబిషన్సు, జాలీ రైడ్స్, హాలిడే ట్రిప్స్... సరే బయటకు వెళ్ళడం కష్టం... ముక్త నన్ను విడిచి అంత సేపు ఉండలేదు... దానికి ఇంకా పది నెలలే... పోనీ... డైమండ్స్, గోల్డ్‌రింగ్స్, కపుల్ ఫోన్స్, వాచెస్, బ్యాంగిల్స్... అబ్బ... ఎన్ని ఉన్నాయి ఇవ్వడానికి... ఏం నేనెప్పుడన్నా ఇవి కావాలన్నానా... నిజంగా నాకవి అవసరం కూడా కాదు... అవి వాడిపై నాకున్న ఇష్టాన్ని ఏ విధంగానూ ప్రభావితం చేయవు... కానీ రసాయన చర్యలో ఉత్ప్రేరకంలా కొంచెం 'స్పీడు' పెరుగుతుంది కదా... వాటికి వేరే దారులయితే ఉన్నాయి కానీ ఎవరన్నా అడిగితే చెప్పడానికయినా ఉండాలి కదా... అసలు ఎవరికోసమూ కాదు... ఈ రోజు గుర్తుగా ఏమయినా ఉండాలి కదా... కనీసం ఏదయినా కొంచెం కొత్త పద్ధతిలో ఒక్కసారి... ఒకే ఒక్కసారి గట్టిగా కౌగిలించుకొని ఐ లవ్‌ యూ అనయినా గాఢంగా చెప్పడు... పొద్దట్నించీ ఎదురుచూస్తున్నా... ఏ పని చేస్తున్నా వీడెప్పడు నన్ను విష్ చేస్తాడా అని ఆలోచించడం... ఫోన్ చేసిన ప్రతీ ఒక్కరూ అదేదో జాతీయ సమస్య అయినట్టు రాఘవ్ ఏం గిఫ్ట్ ఇచ్చాడే... ఎక్కడెక్కడికి వెళ్ళారే... ఎట్లా ‘ఎంజాయ్’ చేస్తున్నారే...? అంటూ వెధవ ప్రశ్నలు... వీడు చూస్తే శుద్ధ మొద్ధావతారం... మూర్తీభవించిన బుద్ధావతారం... మన గ్రహచారం... అపచారం... అపచారం... అని మనసులో చిక్కుముడి పడ్డ ఆలోచనలను దాటుకుంటూ కొంచె రిపెంటయ్యింది మృదుల.

దైవభక్తి ఎక్కువ కదా... ప్రత్యక్షదైవం అంటే ఇంకా... ప్రత్యక్షదైవం పతియే కదా...

***

'హ్యాపీ బర్త్‌డే మృదుల అత్తా...' పదకొండేళ్ళ పవన్... రాఘవ్ మేనల్లుడు విష్ చేసాడు... వాడు గీసిన డ్రాయింగ్ గిఫ్ట్ చేస్తూ... వెనకే ఆరేళ్ళ మేన కోడలు మనస్వి 'కేక్ ఏది...? డెకరేషన్ ఏది...? గిఫ్ట్స్ ఎక్కడ...? బర్త్‌డే అంటే ఇట్లానే చెస్తారా...?' అంటూ వరుస ప్రశ్నలేసింది.

'అట్లా పెట్టు గడ్డి...' పైకి మాత్రం నవ్వి ఊరుకుంది మృదుల.

ఈ జనరేషన్ పిల్లలు దేనికీ కాంప్రమైజ్ అవ్వరు. రాఘవ్ ఏ ఆదిమ ఆటవిక యుగపు విచిత్ర జంతువో అన్నట్టు చూసింది మనస్వి. పొద్దటినుండి మెయింటైన్ చేస్తూ వస్తున్న కృత్రిమ గాంభీర్యం... కేక్ కోసేపుడు పగిలే బర్త్‌డే బెలూన్ అయ్యింది.

భోజనాలయిన తర్వాత ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళిపోయారు మృదుల, రాఘవ్ లను ఏకాంతంలో వదిలేసి... వంటింటి పనంతా పూర్తి చేసుకొని బెడ్ రూంలోకి వచ్చింది మృదుల కనీసం ఇప్పుడైనా నోరు విప్పుతాడా...? అని ఆలోచిస్తూ...

ముక్త ని ఎత్తుకొని 'చూడరమ్మ సతులాల' పాట పడుతూ నిద్ర పుచ్చుతున్నాడు రాఘవ్... నిద్ర పోయిన ముక్తని బెడ్ పై పడుకోబెట్టాడు. ఓ చిత్రాతి చిత్రమైన నవ్వు నవ్వి తనూ పడుకున్నాడు.

కోపం కనురెప్పల మత్తడి దాటి కన్నీటి ధారయ్యింది. తనలో తను గొణుక్కుంటూ మంచానికి మరో వైపు తిరిగి పడుకుంది. టాప్ ఆంగిల్లో చూస్తే అదొక సూపర్బ్ సీన్. ఎటు వైపు తిరగాలో తెలియక నిద్రలోనే ముక్త అటూ ఇటూ తిరుగుతోంది!

'హ్యాపీ బర్త్ డే...!' మెసేజ్ బీప్ గదిలో నిశ్శబ్దాన్ని... మృదుల మదిలోని నిరాశను ఏక కాలంలో మాయం చేసింది. టైం చూసింది... 11.59 pm.

ముసి ముసి నవ్వుతున్న రాఘవ్ ను చూసి మృదుల కోపం బుస బుసా పొంగింది.

'ఏంటో మీరు... అస్సలు అర్థం కారు... మా వాళ్ళు అందుకే చెప్పారేమో... ఒకరికొకరు అర్థం కావాలంటే ఓ పదేళ్ళయినా పడుతుందని'

'ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది...? హ్యాపీ బర్త్ డే... పుట్టిన రోజు శుభాకాంక్షలు...'

'అదే ఎప్పుడు...? ఎప్పుడూ అని...? ఇంకో పది సెకన్లయితే రోజు గడిచిపోతుంది... అప్పుడు'

'ఎప్పుడు చెప్పామన్నది కాదమ్మా.... మెసేజ్ పడిందా లేదా...'

'మీకు నవ్వులాటగానే ఉంటుంది... పొద్దున్న లేచినదగ్గర్నించీ... కాదు... నిన్న రాత్రి పన్నెండు దాటినప్పటినుంచి ఎదురుచూస్తున్నాను... ఆ మూడు ముక్కల కోసం... రోజు మొత్తం ఎందరు ప్రత్యక్షంగా, ఫోన్లో పలకరించినా, మెయిల్లో మెసేజ్ పెట్టినా నా ధ్యాసంతా మీ పైనే ఉంది... రోజంతా... '

' అవునా...'

'బాబూ మీకో దండం... ఆ మూడు అక్షరాల అర్థం ఏమిటో గానీ... పొద్దటినించి ఓ వంద సార్లు అని ఉంటారు... మనసుల్ని పిండేస్తారు...'

మ్యాటర్ సీరియస్ అవుతుందని గమనించిన రాఘవ్ కొంచెం స్వరం మార్చాడు

'అసలు బర్త్ డే ఎందుకు జరుపుకుంటారు...? జీవితపు బీజానికి రూపం, గుణం, కాలం, యోగాలను అద్దిన సృష్టికర్తకు... ఆ బీజాన్ని నాటి, ఒదిగి పట్టుకొని జన్మనిచ్చిన తల్లి తండ్రులకు... ఆ బీజం మొక్కగా మొలకెత్తడానికి నేలా, నీరు, ఎండా, గాలి, ఆకాశం అయిన ఉపాధ్యాయులకు, గురువులకు... మొక్కకు చుట్టూ పాదులా నిలబడి రక్షణ కవచమైన తోబుట్టువులకు... జీవన వనంలోకి వసంతాన్ని ఆహ్వానించి, ప్రతీ గ్రీష్మాన్నీ మరపింప జేసిన స్నేహితులకు... మొక్కకు చుట్టూ కంచెలా కష్ట సుఖాల్లో తోడునిలిచే బంధువులకు... ఎదిగిన చెట్టుకు పూలు, పండ్లతో కొత్త సొగసులనద్దిన జీవిత భాగస్వామికి... ఇట్లా తమ జీవితపు అస్తిత్వానికి మూలమైన, కారణమైన, పోషకులైన, ప్రేరకులైన వారందరినీ తలచుకోవడం... మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవడం... అదీ పుట్టిన రోజు జరుపుకోవడానికి అసలు ఉద్దేశ్యం... నాదృష్టిలో...'

'ఒహొ... అయితే మా పుట్టిన రోజున మమ్మల్నెవరూ గుర్తుచేసుకోనవసరం లేదన్నమాట... బాగుంది...'

'నా దృష్టిలో గుర్తుచేసుకోవడం అంటేనే రెండు వైపులా సాగే ప్రేమ ప్రవాహం... నీవు ప్రేమతో పంపిన నిశ్శబ్ద సందేశం 'బూమరాంగ్'లా రెట్టించిన ప్రేమతో మళ్ళీ నిను చేరుతుంది...'

'మరి పొద్దట్నుంచీ నేను సిగ్నల్సు పంపుతూనే ఉన్నాను ఓ మహానుభావుడికి... మరి ఒక్కటీ తిరిగిరాలేదు ఎందుకో...?'

'తప్పకుండా వస్తుంది... సముద్రం ఆకాశాన్ని ఆవిరి రూపంలో పలకరిస్తే... వాన రూపంలో ఆకాశం కరగాల్సిందే... సముద్రాన్ని మళ్ళీ కలవాల్సిందే...'

' బాబూ... ఈ అనాలజీస్ వద్దు... పొద్దటినించీ చేయకుండా ఇప్పుడు విష్ చేయడంలో అర్థం ఏమిటో సెలవిస్తారా...? తెలుగులో...!'

'అందరిలా ఉదయాన్నే నేనూ విష్ చేసుంటే మహా అయితే ఓ గంట పాటు అది నీ మనసులో ఉండేది... అంటే ఇమ్మీడియట్ మెమొరీలో... ఆ తర్వాత నేనూ అందరిలో ఒక్కడినైపోతాను కదా... అందుకే ఈ రోజంతా నిను విష్ చేయకుండా నీ ఆలోచనల్లో నేను మాత్రమే ఉండాలని కోరుకున్నాను. అట్లాగే నిను విష్ చేయాలనే ఆరాటాన్ని ఆపుకోలేక... అట్లాగని ముందే విష్ చేసి నీ మనసులో 'నో వెకెన్సీ' బోర్డు చూడ్డం ఇష్టం లేక ప్రతి క్షణం నీ ధ్యాసలోనే ఉన్నాన్నేను. నీ ఆలోచనల లోకంలో ప్రతీ చోటునీ అక్రమించాలనుకున్నాను... అది దురాక్రమణ అయినా సరే...! అట్లే నా తలపుల తలుపులు తెరిచి నీ కోసం ప్రతీ ప్రదేశాన్నీ రిజర్వు చేసాను... ఈ ప్రత్యేక అహ్వానితురాలి కోసం... సామ్రాట్టునై... సామంతుడనై... శిక్షకుడనై... శిక్షితుడనై... నీలో నేను... నాలో నీవు... నువ్వు నేనై... నేను నువ్వై... నేనూ నీవూ మనమై... ఒకటై... అభిన్నమై... అభేదమై... అద్వైతమై...!'

అర్ధంతరంగా ఆపాడు రాఘవ్...

'హుమ్మ్...మ్మ్...మ్మ్... కొంచెం నాటకీయత ఎక్కువైంది బాబూ... అయితే నీ కాన్సెప్ట్ నచ్చింది బతికిపో...! వెయిట్... వెయిట్... అయితే ఇది నా 'బర్త్ డే' కాదన్నమాట... నా 'భర్త డే' అన్నమాట... బాగుంది... బాగుంది...'

అభిన్నతకు, అభేదానికి, అద్వైతానికి లౌకిక అభివ్యక్తిగా ఆ జంట గాఢ ఆలింగనంలో ఒడలు మరిచింది.

****

No comments: