(A review of the movie Rangamarthanda, directed by Krishna Vamsi Garu.)
రాఘవరావు (ప్రకాష్ రాజ్) పేరుమోసిన
రంగస్థల కళాకారుడు. ఒక సన్మాన సభలో అభిమానులు ఆయనకు ఇచ్చిన బిరుదు ‘రంగమార్తాండ’.
నిష్క్రమణం కూడా పట్టాభిషేకం అంతా గొప్పగా ఉండాలని అదే సన్మాన సభలో ప్రకటిస్తాడు
రాఘవరావు. ఒక మహోజ్వల రంగస్థల చరిత్రకు ఆ విధంగా రాఘవరావు ముగింపును ప్రకటిస్తాడు.
అప్పుడు తన నిజ జీవితంలో మరో అంకం మొదలవుతుంది. ఈ ఆట అతనికి కొత్తది. అనేకానేక
పాత్రల్ని అవలీలగా పోషించిన రంగమార్తాండుడికి ఈ నిజజీవితం నడిరాతిరి చీకటిలా
పరిణమిస్తుంది.
నాటకరంగం నుండి నిష్క్రమణ ప్రకటించిన రోజే తన ‘prime property’ని
తన కొడుకుకి (ఆదర్శ్ బాలకృష్ణ) బాస్ అయిన కోడలికి (అనసూయ
భరద్వాజ్) రాసేస్తాడు. కూతురు (శివాత్మిక) ప్రతిఘటించేలోపే సేవింగ్స్, షేర్స్,
ఆభరణాలు అన్నీ ఆమెకు ముట్టచెప్తాడు. మరి తన భార్య రాజు గారికి (రమ్యకృష్ణ)? ‘తన నఖ
శిఖ పర్యంతం ఆమెకే’ అని అంటాడు. మరి మీరేం ఉంచుకోరా అంటే వజ్రాల్లాంటి తన
పిల్లలుండగా తనకేం దిగులు అంటాడు. ఆస్తి ఎప్పుడైనా తమకు వస్తుందన్న స్పష్టత ఉన్న
కోడలు ‘దిష్టి చుక్కలా’ ఉన్న ఆ ఇంటిని 10 అంతస్తుల భవనం నిర్మించేలా developmentకి ఇవ్వడానికి తన cousinతో చర్చలు అప్పటికే
జరిపిఉన్నది. తన ఆస్తిని ‘తల్లికే’ (తన కోడలు ఆ సమయంలో గర్భవతి) ఇస్తున్నాననుకుంటాడు
రాఘవరావు. తిండివిషయంలో, నిద్ర విషయంలో, భాష, చదువు, పిల్లలను పెంచే విషయంలో,
ఇంటిని ‘కూల్చే’ విషయంలో కోడలికి, రాఘవరావుకి మధ్య మొదలైన అభిప్రాయభేదాలు తారా
స్థాయికి చేరి, చివరికి ఒక్కో ఇటుక ఒక్కో జ్ఞాపకంగా, అనుభవంగా, అనుభూతిగా నిలిచి
వున్న తన సొంత ఇంటినుండే వెలివేయబడే పరిస్థితి దాపురిస్తుంది ఆ దంపతులకి. ఒక వజ్రం
ఉట్టి బండరాయి అని తేలుతుంది. ఆ ఇంట్లో భూకంపం వచ్చినట్టుగా భ్రాంతి కలిగించేలా
కెమెరా ఊగుతుంది. ఇల్లు కుప్ప కూలబోతున్నదన్న విషయాన్ని సాంకేతికంగా సూచిస్తారు
దర్శకులు. ఒక అంకం ముగిసిందని రాఘవరావుకు అర్థం అవుతుంది.
‘బస్టాండుకు చేరిన’ రాఘవరావు
దంపతులు, పిల్లలు లేని మిత్రుడు చక్రి (బ్రహ్మానందం) సలహాతో, “ఆడపిల్లకు పెళ్లి
చేస్తే పాడె కట్టి పంపినట్టే”, “కూతురు, కొడుకూ ఒకటి కాదా” అని అంటున్న ‘బతకనేర్చిన’
బిడ్డ మాటలు విని మనసు మార్చుకుంటారు. ‘నల్ల బంగారం’ వంటి తీయనైన అల్లుడు (రాహుల్
సిప్లిగంజ్) మామతో బాగా కలిసిపోతాడు. ‘లగోరంగ లగోరే’ అంటూ గొంతు కలుపుతాడు, పాట
అందుకుంటాడు, ఆట కడతాడు. కానీ అయినదానికి కానిదానికి కావులిచ్చుకునే, ముద్దాడే
బిడ్డ ఒక వెలుగు వెలిగిన రాఘవరావుని ముద్దుగా ‘షట్ అప్’ అంటుంది, ‘ఫేక్’గా
ఉండమంటుంది. మిత్రుడు చక్రి భార్యా వియోగంలో ఉంటే అతని దుస్థితిని చూసి చలించిపోయిన
రాఘవరావు పొట్టు పొట్టు తాగి తన ‘దమిడి
సేమంతి’ని “నీ పక్కన నేనో గరిక పాటి కూడా కానని” అపరాధ భావంతో ప్రేమ
ప్రకటిస్తాడు. అల్లుడు, ఒక వర్ధమాన నటుడు, అతని వయస్సు కుర్రాళ్లతో చిందులేస్తాడు.
ఆ తెల్లారి ‘Career-conscuious’ ‘బంగారం’ మా భవిష్యత్తు నీకు పట్టదా
అంటూ నిలదీసి ఆ రంగామార్తాండను ‘తన లాగా తానుండకుండా ఆంక్షలు’ విధిస్తుంది.
లండన్ లో ‘థియేటర్’ నేర్చుకున్నా King Lear సంభాషణకి, Hamlet సంభాషణకి తేడా తెలియని ఒక ‘spoilt
brat’ తెలుగు సినిమా రంగాన్ని, నాటక రంగాన్ని ‘Too Loud’ అంటూ తూలనాడుతుంటే, అడ్డుపడి ఆత్మాభిమాన ప్రకటన చేసి, భాష సరిచేసుకొమ్మని,
పొడి మాటలు కాదు వాటి వెనకాల ఉన్న తడిని అనుభూతి చెందమని ఆ కుర్ర కుంకకు సలహా ఇస్తాడు
‘రంగమార్తాండ’. ఆ ఔత్సాహిక నటుడి అజ్ఞానం, అహంకారాన్ని అసహ్యించుకుని కాండ్రించి ఉమ్మేస్తాడు.
కాస్త సంస్కారం నేర్పమని అతడి తల్లికి గడ్డి పెడతాడు. తండ్రి అభిమాన ప్రదర్శన,
తిట్ల దండకం ఎక్కడ తమ కెరీర్ ను నాశనం చేస్తుందోనన్న ఆరాటంలో, అసహనంలో తల్లి
తండ్రులను పనికి రాని పాత సామాన్లలాగా సెల్లార్ కు చేరుస్తుంది ‘కాకి బంగారం’.
ప్రాణ మిత్రుడిని తన చేతులతోనే mercy killing చేసి పుట్టెడు దుఃఖంలో ఉన్న రాఘవరావును అత్యుత్సాహపు కూతురు అనుమానించి ఘోరంగా
అవమానిస్తుంది. స్నేహితుడి వైద్యానికి అయిన హాస్పిటల్ బిల్లును అపురూపమైన తన
గండపెండేరాన్ని అమ్మితే వచ్చిన డబ్బుతో కట్టడానికి సిద్ధమైన రాఘవరావుపై
అన్యాపదేశంగా ‘దొంగ’ అనే ముద్ర వేస్తుంది జాతిరత్నం లాంటి కూతురు. ‘ఒక మాట చెప్పి
తీసుకోవాలిగా.. అల్లుడికి తెలిస్తే ఏమనుకుంటాడు’ అంటూ జీవిత అనుభవాలతో పండిన
రాఘవరావుకే నీతులు చెప్పే దుస్సాహసం చేస్తుంది. రంగస్థలంపైన ఈ సన్నివేశాన్ని
రాఘవరావు ఒక తండ్రి పాత్రలో ఎట్లా పోషించేవాడో గానీ, గడ్డకట్టిన తనలోని దుఃఖం అంతా
ఆ అవమాన భారానికి కరిగి కట్టలుతెగుతుంది. రాఘవరావు తన బంగారంపై ప్రచండ
మార్తాండుడిల విరుచుకుపడతాడు. తప్పు తెలుసుకుని కూతురు పశ్చాత్తాప పడ్డా ఆ
అర్థరాత్రి మనసువిరిగి తన ‘రాజు గారితో’ రంగమార్తాండ సొంత ఊరికి పయనమవుతాడు. దీంతో
మరో అంకం ముగుస్తుంది.
ఒక గుడి సమీపంలోని నిర్మానుష్యంగా
ఉన్న ఒక చెట్టుకింద ఆ దంపతులు సేద తీరుతారు. తెల్లారి ఎనిమిదింటికి బస్సు. ‘To be, not to be! That is the question’ని తరచుగా ఉటంకించే రాఘవరావుకు అదసలు ప్రశ్నే కాదని,
మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే పోయారని, తామిద్దరం ఒకరికి ఒకరుగా ఉందామంటూ కమిలిన
గుండెకు ఓదార్పు లేపనం పూసి నిద్రలోకి జారుకున్న ‘రాజు గారు’ తెల్లవారినా కళ్ళు
తెరవరు. నిద్ర పోయే ముందు అక్కడి నాగదేవత చుట్టూ ధగ ధగ కాంతులతో వెలుగుతున్న
దీపాలు తెల్లారేసరికి ఆరిపోతాయి. ఒక మహిళ ఆ వెలుగు ఆవిరైన ప్రమిదలను ఏరుతుంది. మరో
రోజు వెలిగించడానికి సిద్ధం చేయాలి కాబోలు. ఊరికి వెళ్లాల్సిన ‘రాజు గారు’ మరేదో
లోకానికి పయనమవుతారు. గుండె పగిలి, మనసు విరిగి జీవచ్ఛవంలా మారతాడు రంగామార్తాండ.
ఒక ధాబాలో
ఎంగిలి కంచాలు ఎత్తి, కడిగే
పనిచేస్తుంటాడు. మళ్ళీ ఆ ఔత్సాహిక నటుడి కంట పడతాడు. ఇప్పుడా నటుడు నటనలో శిక్షణ
తీసుకుని, వ్యక్తిత్వంలో పరివర్తన తెచ్చుకుంటాడు. అదే సమయంలో రాఘవరావు పిల్లలూ
కనిపించకుండా పోయిన తమ తల్లితండ్రుల ఆచూకీ తెలుసుకోవడం కోసం ప్రయత్నాలు
చేస్తుంటారు. తాను ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి, రంగమార్తాండగా రూపాంతరం చెందడానికి
వేదికైన ‘కళా భారతి’ కాలి బూడిద అయ్యిందన్న వార్త టీవీలో చూసి నిర్ఘాంతపోయిన
రాఘవరావు ఆ యువ నటుడితో హైదరాబాద్ వస్తాడు. అప్పుడు తనకు మిగిలిన ఏకైక బంధం ఆ కళా
భారతి. చెల్లా చెదురైన వస్తువులు, వేలాడుతున్న ఫ్యాన్, బూడిదైన కుర్చీలు, శవ దహనం
తర్వాత శ్మశానంలో మిగిలిన బూడిదలా మారింది కళాభారతి. అచ్చం రాఘవరావు జీవితంలాగా..
తన నాటక
జీవితమే సర్వస్వంగా బతికిన వ్యక్తి, ఆ రంగంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నపుడే retirement ప్రకటించి,
పోషించిన పాత్రల నుండి, ఆ ‘పార్థివ శరీరాలను’ మించిన తన అస్తిత్వం కోసం ప్రయాణం
సాగిస్తాడు. కన్న బిడ్డలకు తనకు ఉన్న బంధం పరిమితులను అర్థం చేసుకుంటాడు. ““నిజమైన
రంగమార్తాండ నువ్వేరా.. కాలం నన్ను నటుడిగా నిలబెట్టింది.. నిన్ను కాలితో
తన్నింది..” అని తన హితుడు, స్నేహితుడు అయిన చక్రితో అణకువగా అంటాడు. తన ప్రతిభా
పాటవాలకు తన ప్రయత్నమే కాదు.. అదనంగా దైవమో, మరేదో అదృశ్యశక్తో కారణమని
గ్రహిస్తాడు. జీవితాంతం తనకు అండగా ఉన్న మిత్రుడికీ సహాయం చేయలేని తన ఆశక్తతను
గుర్తిస్తాడు. అన్నం తినిపించిన చేతితోనే చావుని తినిపిస్తాడు! ‘నీవు లేక నేను
లేను’ అని భార్యతో అన్న వ్యక్తే ‘మునిమాపు ముసిరేటి వేళ, వీడిపోయే నీడలా’
వెళ్లిపోతే ‘శుబ్బరంగా బతికే ఉంటాడు’. జీవిత చరామాంకానికి చేరుతాడు రంగమార్తాండ
రాఘవ రావు.
చివరకు శ్మశాన
సదృశంగా ఉన్న కళాభారతిలో ‘నేనెవర్ని?’ అని బిగ్గరగా అరుస్తాడు.. తాను రంగస్థలంపైన
పోషించిన పాత్రలు రావణ బ్రహ్మ, దుర్యోధనుడు, గిరీశం, మురారి ఇంకా ఎన్నో.. ఇవే
తానా? నిజ జీవితంలో పోషించిన భర్త, స్నేహితుడు, కొడుకు, తండ్రి, తాత, సంఘంలో ఒక
గౌరవనీయ వ్యక్తి.. ఇవి తానా? ఇవేవీ కాదు తాను.. Life is a sad play to be lived happily అనేదే నిజమా? ఆనందం విషాదానికీ, విషాదానికీ మధ్య విరామం అన్నదే సత్యమా?
కాదు! వీటన్నిటికీ తాను ఒక సాక్షి. రంగస్థల పాత్రలను ధరించి, విసర్జించినట్టుగానే,
ఆ జీవిత పాత్రలను పోషించి వదిలేసిన నిత్యమూ, సత్యమూ, ఆద్యంతం లేని ఆత్మ తాను.
అందుకే మన నిలయం నర్తనశాల.. మన కొలువు విరాట రాజు ఆస్థానం.. మన జీవితం ఒక
విరాటపర్వం.. ఏదో ఒక రోజు ముగించాల్సిన అజ్ఞాత వాసం.. అప్పటిదాకా బాయిలోని గిలక
లెక్క తిరుగుతూనే ఉంటుంది భూమి.. కాలచక్రం తన భ్రమణం ఆపదు.. ఎంత ‘ఎలిగినోడయినా
మలిగిపోక’ తప్పదు.. అందుకే ఆ దేవుడు జేబుల పెట్టిన ఆ ‘వంద’ తోటి, సాటి మనుషుల మందల
కలిసి కాస్త ప్రేమ పంచితే ‘పేరు నిలవడతది’. (కాసర్ల శ్యామ్ రచన)
నెన్నుదుటిపైన
విధాత రాసిన రాతను దిగువనున్న కళ్ళతో మనం చదవాల్సిన పనిలేదు.. పైనున్నవాడు నడిపే
నాటకంలో మనం నటులమైనా మన పాత్రల్ని మనమే చూసుకునే ప్రేక్షకులమూ అవ్వాలి.. పువ్వై
విరిసే ప్రాణాన్ని, పండై మురిసే ప్రాయానికి సాక్షులమవ్వాలి.. అప్పుడు మళ్ళీ మళ్ళీ
వందేళ్లు రోజూ సరికొత్తగానే ఉంటాయి.. బతకడమంటే ఏంటో తెలుపుతాయి! (సిరివెన్నెల రచన)
సమరానికి ముందు అర్జునుడికి
అవసరమైన సందేశాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీత రూపంలో అందిస్తే, జీవిత సమరానికి
అవసరమయిన జ్ఞానాన్ని సిరివెన్నెల, కృష్ణవంశీ ‘రంగామార్తాండ’ రూపంలో మనకందించారు.
అందుకే నేటి సమాజానికి అవసరమైన ఆత్మ జ్ఞాన ‘గీత’, రంగమార్తాండ!