Friday, April 09, 2010

తెలంగాణ మాండలిక సహజ, క్రమ వికాసం ప్రత్యేక రాష్ట్రంలోనే సాధ్యం!

యాదృచ్ఛికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ వారు ప్రచురించే 'ఆంధ్రప్రదేశ్' ఫిబ్రవరి 2010 సంచికలో 'దీపావళి హాస్య కథల పోటీ - 2009' లో సాధారణ బహుమతి పొందిన ఎం. హేమలత గారి 'కడప మంగమ్మత్త' కథను చదివాను. సంస్కృతీ సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో ముఖ్యంగా భాష విషయంలో తమ ప్రత్యేక అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం తెలంగాణా తిరగబడుతున్న ఈ చారిత్రక సమయంలో ఈ ప్రాంత భాషను అపహాస్యం చేస్తూ వచ్చిన కథను హాస్య కథల విభాగంలో ప్రచురించడం నన్ను కొంత ఆశ్చర్యానికి మరెంతో ఉద్వేగానికి లోను చేసింది.



ఉద్యోగరీత్యా కడపకు చెందిన ఒక జంట విజయవాడ, హైదరాబాదు ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. వారికి కూడా 'మంగమ్మత్త' గారు వెళ్తారు. 'కడప' దాటని మంగమ్మత్త వివిధ మాండలికాలతో పడే అవస్థ కథా వస్తువు. కథంతా మంగమ్మత్త కోడలు సరసి(?) 'చైతన్యస్రవంతి'లో సాగుతుంది. కడప జిల్లా మాండలికాన్ని 'బెజవాడ'లో ప్రయోగించి భంగపడుతుంది మంగమ్మత్త. అయితే మంగమ్మత్తకు సర్కారు జిల్లాల మాండలిక పదాలకు అర్థం తెలీకపోవడంలో ఆశ్చర్యం లేదంటుంది సరసి. బెజవాడలో 'మంగమ్మత్త భాష విషయంలో తికమక పడ్డా అలవాటు పడ్తుంది'. తర్వాత వారు హైదరాబాదుకు బదిలీ అయి వస్తారు. వచ్చీరావటంతోనే వారికి ఇక్కడి భాష 'కీసర-బీసర'గా తోస్తుంది. 'మేమ్ సాబ్' , 'కేలా', 'సీకో','బేటీ', 'పోరీ',వంటి ఆశ్చర్యకరమైన పదాలను భరిస్తున్న వారికి ఎల్కపళ్ళు అనే పదం ఎదురౌతుంది. అపచారం! మహాపచారం! ఉపద్రవం! మహోపద్రవం! 'ఎక్కడి ఎల్కపళ్ళు? ఎక్కడి వెలగపళ్ళు? ఇక్కడివాళ్ళ నోళ్ళలో పడి భాష హాస్యస్ఫోరకమవుతోంది' అని నోరు జారుతుంది రచయిత్రి! గమనించాల్సిన మరో విషయం ఏంటంటే ఈ అత్తాకోడళ్ళిద్దరూ ఈ పదాలకు అర్థాలు పనిమనిషి రంగమ్మ నుంచే తెలుసుకుంటుంటారు! ఇదీ వరస! ఇంకా 'రౌతు' అన్న పదం పైన రాద్ధాంతం, 'మాణిక్యాలు' అన్న పదం పైన ఎకసెక్కాలూ వగైరా వగైరా! ఇదీ ప్రభుత్వం విధానాలను, కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే మాధ్యమం ప్రచురించిన ఉత్తమ హాస్య కథ!



తెలుగు భాషను కాపాడుకోవటం కోసం తెలంగాణా ఎంత కష్టపడింది? ఎంత ఆత్రుత పడింది? ఎన్ని అవమానాల్ని ఎదుర్కొంది? ఎంత అవహేళనలకి గురయ్యింది? ఎంత స్ఫూర్తిమంతమైన పోరాటం చేసింది? దాశరథి రంగాచార్య 'చిల్లరదేవుళ్ళు' చదువుతుంటే కళ్ళు చెమర్చాయి. ముఖ్యంగా సారంగపాణి హైదరాబాదుకు వచ్చిన సందర్భంలో అక్కడి పరిస్థితుల్ని రచయిత వర్ణించిన తీరు నిజాం నవాబుల కాలంలో తెలంగాణ భాష విషయంలో ఎదుర్కొన్న వివక్ష కళ్ళకు కడుతుంది. అయితే ఇక్కడే ఒక విషయం ప్రస్తావించాలి. తెలుగు భాషను అణగదొక్కడం విషయంలో నిజాం రాజులు ఖచ్చితంగా దోషులే. అందుకు వారిని నిరంకుశులని అనడం తప్పేమీ కాదు. ఆ మాటకొస్తే రాజులందరూ నిరంకుశులే! రాచరిక వ్యవస్థ మౌలికంగా క్రూరమైంది, దయా దాక్షిణ్యం లేనిది. ప్రభువులు తమ పదవిని కాపాడుకోవడం కోసం అనేక దుశ్చర్యలకు పాల్పడుతుంటారు. దీనికి ఎవ్వరూ మినహాయింపు కాదు. అట్లాగే తన పీఠాన్ని కాపాడుకోవడం కోసం నిజాం భాషా విద్వేషాలను రగిల్చాడు. ఇతర భాషల్ని ధ్వంసం చేయడానికి ఉర్దూని ఆయుధంగా ఉపయోగించాడు. ఉర్దూని ముస్లింల భాషగా దుష్ప్రచారం చేసాడు. ప్రజల మధ్య తను కోరుకున్న చీలికను తీసుకొచ్చాడు. అయితే కొంతమంది రాజులకు 'జాతి గీతాల్లో' చోటు కల్పించి ఆకాశానికెత్తుతూ మరి కొందరిని విమర్శించడమే సందేహాలకు తావిస్తోంది. అనేక ఆర్ధిక సామాజిక అంశాలతో పాటు నిజాం రాజుల ఈ సాంస్కృతిక అణచివేత కూడా 1945-48 సాయుధ పోరాటానికి కారణమయ్యింది. భారత ప్రభుత్వ 'సైనిక చర్య' తో స్వేచ్చా వాయువుల్ని పీల్చుకున్న తెలంగాణా వాసులు తమ భాష వికాసం విషయంలో అనేక కలలు కన్నారు. అవి కల్లలైనాయన్నవిషయం ప్రస్తుత తెలంగాణా ఉద్యమాన్ని గమనించిన వారికి సులువుగానే అర్థమౌతుంది.



నిజాం తెలుగు భాషను అవహేళన చేయడానికి, అణచడానికి కారణాలు సుస్పష్టం. అయితే ఇదే సమయంలో సాటి కోస్తాంధ్ర, సీమాంధ్ర ప్రాంత తెలుగు కవిశేఖరులూ తెలంగాణా ప్రాంత తెలుగు పైన చేసిన దాడి తక్కువేమీ కాదు. తెలంగాణాలో తెలుగు కవులే లేరని గేలి చేసిన ముడుంబై రాఘవాచార్యుల వారికి సురవరం ప్రతాపరెడ్డి గారు 'గోల్కొండ పత్రిక' ద్వారా తగిన సమాధానమే ఇచ్చారు. ఆ తర్వాత ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ లోనూ తెలంగాణా మాండలిక వ్యవహర్తలు అవమానింప బడుతూనే ఉన్నారు. నిజానికి హేమలత గారి కథ ద్వారా వ్యక్తమయిన కోస్తాంధ్ర, సీమాంధ్ర భాషా ఆభిజాత్యం తెలంగాణా వారికి కొత్తేమీ కాదు. ఉదాహరణకు నా స్వానుభవంలోని సంఘటననొకదాన్ని వివరిస్తాను. సివిల్ సర్వీసెస్ పరీక్షకు శిక్షణనిచ్చే ఒక 'మాస్టారు' ప్రామాణిక భాష పై ఉపన్యసిస్తూ మమ్మల్ని( ఉద్యోగార్థుల్ని) ఈ విధంగా అడిగారు. కోస్తా, రాయలసీమ, తెలంగాణా మాండలికాల్లో ఏది చెవికి ఇంపుగా ఉంటుంది? ఆశించిన సమాధానం రాకపోయేసరికి మళ్లీ వారే 'రోశయ్యా, వీ హెచ్ హనుమంతరావూ, మారెప్ప గార్లలో ఎవరి మాట వినసొంపుగా ఉంటుంది'? అని అడిగారు. అప్పటికీ మేం సమాధానం చెప్పక పోయే సరికి వారే కృష్ణా జిల్లా మాండలికం ప్రామాణికమైనదని ప్రకటించి విరమించారు. ఇది పండితుల సంగతి. ఇక తెలుగు భాషను చదవడం, రాయడం రాని స్కూలు పిల్లలు కూడా తెలంగాణా మాండలిక పదాలను గుర్తించి వారి అసహనాన్ని ప్రదర్శిస్తారు. నాకు తెల్సిన కొంతమంది పిల్లలు తమ ఆర్కుట్ ప్రొఫైల్లో ఏకంగా తమిళం,మలయాళం, కన్నడం, బెంగాలి వంటి భాషల సరసన తెలంగాణా మండలికాన్నీ చేర్చారు! హైదరాబాదులో ఇలాంటి అనుభవాలు గత 13 సంవత్సరాలుగా మాకు దైనందిన జీవితంలో భాగమైపోయాయి. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే, నిజాం రాజుల పాలననుంచి ఈ నాటివరకూ కేవలం వ్యక్తులు మారారు కాని వ్యవహార శైలి మారలేదు, తెలంగాణ భాష విషయంలో పడుతున్న గోస తీరలేదు! ఈ తెలంగాణా మాండలిక వ్యతిరేక భావజాలం స్థూలంగా తెలంగాణా ప్రాంతంపై ఉన్న వ్యతిరేకతలో భాగమేనని నేను భావిస్తాను.


ఒక భాషకు అనేక మాండలికాలు ఉండటం ఆ భాషా సుసంపన్నతను తెలియచేస్తుంది. ఒక్క ఉదాహరణ ఇస్తాను. తెలంగాణలో వచ్చిన్రు (ఒచ్చిన్రు), వచ్చిండు (ఒచ్చిండు) అనే పదాలు వాడుతుంటారు. భాషా పరిణామ శాస్త్ర సూత్రాల ప్రకారం ఈనాటి 'వారు'కి పూర్వ రూపం 'ఆవన్రు'. దీన్ని బట్టి 'వచ్చిన్రు' అన్న పదం కూడా అత్యంత పురాతన పదమని అర్థమౌతుంది. అలాగే 'వచ్చిండు' పదం. ఇవే రాయలసీమలో 'వచ్చినారు', 'వచ్చినాడు'గా, కోస్తాంధ్రలో 'వచ్చారు', 'వచ్చాడు'గా వాడుకలో ఉన్నాయి. దీనికి కారణాలు రాజకీయ చరిత్రలో మనకి దొరుకుతాయి. 14వ శతాబ్దం తర్వాత తెలంగాణలో తెలుగు భాషా వికాస స్రవంతి మిగతా తెలుగు ప్రాంతాల భాషా వికాస స్రవంతికి భిన్నమైన దారిలో వెళ్ళింది. ఒకరకంగా చెప్పాలంటే 14వ శతాబ్దం నాటి భాషను కొద్ది మార్పులతో నేటికీ తెలంగాణా ప్రాంతం వారు వ్యవహరిస్తున్నారు. ఏ భాషకైనా ఇట్లా వివిధ కాలాల్లోని పూర్వ రూపాలు ఒకే కాలంలో నిలిచి ఉండటం చాలా అసాధారణమైన, గర్వించదగిన విషయం. కానీ తెలుగు వారికి ఈ వైవిధ్యమే శాపమయ్యింది. అనేక ఇతర భాషల ప్రభావంతో పాటుగా పర్షియన్ భాషా ప్రభావం అత్యధికంగా ఉన్న హైదరాబాద్ మాండలికం, మిగితా తెలంగాణా మాండలికం ఒక్కటే అన్న భ్రమను పరిశోధన అంటే ఏమిటో కూడా తెలియని సినీ పరిశ్రమ కల్పించింది. దానికి హేమలత గారి లాంటి రచయితల అజ్ఞానం తోడయ్యి తెలంగాణ భాషపై కోస్తాంధ్ర, సీమాంధ్ర వాసులకు ఒక చులకన భావాన్నేర్పరిచింది.



భారత రాజ్యాంగంలోని 29వ అధికరణం భాష, లిపి, సంస్కృతులను సంరక్షించుకోవడాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించింది. తెలంగాణ మాండలికం తెలంగాణ సంస్కృతిలో అభిన్నాంగం. మాండలిక సంరక్షణలో భాగంగానే దాని సహజ, క్రమ వికాసం పొందగలిగే స్వేచ్ఛనూ చేర్చాలి. తెలంగాణ మండలికంపై ప్రామాణిక భాష పేరుతో రుద్దబడుతున్న కృత్రిమ వికాసాన్ని ప్రతిఘటించే హక్కు ఆ ప్రాంత ప్రజలకు ఉంది. స్వతంత్ర భారతదేశ చరిత్ర లోనే అపూర్వ స్థాయిలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగుతున్న తరుణంలో ప్రభుత్వ అధికారిక పత్రిక ఇలాంటి కథను ప్రచురించిందంటే ఇక్కడి ప్రజల మనోభావాలకు 'సమైక్య' రాష్ట్రంలో ఏపాటి విలువుందో తేట తెల్లమవుతుంది. అందుకే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో మాత్రమే ఈ సాంస్కృతిక హక్కు ఫలాలను వారు అనుభవించగలరనటంలో ఎలాంటి సందేహం లేదు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండు వెనక అనేక సామాజిక, ఆర్ధిక కారణాలున్నాయి. ఇది చర్విత చర్వణమే! అయితే అంతే బలమైన సాంస్కృతిక కారణాలున్నాయన్న విషయం విస్మరించలేం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతయినా తెలుగు భాషకు సుసంపన్నత, పరిపుష్టి చేకూర్చడంలో తెలంగాణ మాండలికపు న్యాయమైన స్థానాన్నిగుర్తించి, తెలంగాణ ప్రాంతానికి భాష విషయంలో జరిగిన అన్యాయాన్ని ఇతర ప్రాంతాల వారు అంగీకరించిన రోజు మాత్రమే నిజమైన సమైక్య తెలుగు రాష్ట్రం సాధ్యమౌతుంది. అప్పటివరకూ సమైక్యవాదం అంటే ఈ ప్రాంత హక్కులను హరించటానికి జరిగే కుట్ర గానే భావించవలసి వస్తుంది.

Thursday, April 01, 2010

Anaatha - Orphan

అనాథ

అందమైన ప్రాయాన్ని
అవసరానికి అమ్ముకుని
ఆకలి తీర్చింది అమ్మ!
ఆకలైతే తీరింది
అనంత శోకం మిగిలింది!
పాడుబడ్డ రోగమేదో కాళరాత్రై
చల్లటి చందమామను కసిదీరా కబళించింది
అమ్మ అగుపడని లోకాలకు వెళ్లి పోయింది !!

అప్పట్నించి...

చిప్పిరి జుట్టూ, చీమిడి ముక్కూ
చిరిగిన గుడ్డలూ
ఇవే నా లేటెస్ట్ ఫాషన్

మండుటెండలు, కడుపుమంటలూ
ఎండమావులూ,గుండెకోతలూ
నను వీడని నీడలు

గజ్జి కుక్కలూ, 'గలీజు పోరలు'
'ఉడా' పెంచిన గడ్డిమొక్కలూ
నాకు దోస్తులు

పిడికెడు కూడూ, సరిపడు గూడూ
వదలని తోడూ
నా కోరికలు

వెకిలి నవ్వుల వెక్కిరింపులూ
చీదరింపులూ, ఛీత్కారాలూ
నేనడగని సత్కారాలు

వసంత కాలపు వికసించిన విరులూ
సమస్త ప్రాణుల సంరక్షించే ప్రభువూ
తిమిరముకావలి భానూదయాలూ
నను నడిపిస్తున్న వెలుగు దివ్వెలు

(1999)

మాట ఇస్తావా నేస్తం!

మాట ఇస్తావా నేస్తం... మాట ఇస్తావా నేస్తం

తల్లి తండ్రులు, గురువు, స్త్రీలను
కష్టపెట్టక, కింఛపరచక
భరత దేశపు భవ్య రీతిని
భద్రముగా కాపాడుతానని -- మాట ఇస్తావా


ఏళ్ళు గడచిన బతుకు మారని
ఊళ్లు తిరిగిన మెతుకు దొరకని
పేద ప్రజల కన్నీళ్ళు తుడిచి ఈ నేల
ఋణమును తీర్చుతానని  -- మాట ఇస్తావా


పదవి పొందుటే పరమార్థమ్ముగా
ప్రజల సుఖమే తాకట్టు స్తువుగ
నడి బజారున నిన్నమ్ము నేతల
నడ్డివిరిచి, గద్దె దించి
ప్రజా శక్తిని చూపుతానని -- మాట ఇస్తావా


హద్దుమీరిన అరాచకానికి
జీహాదు అంటూ పేరు పెట్టి
సరిహద్దు దాటితీవ్రవాదుల
గుండు గుండుకు గుండె చూపి
తన నిండు ప్రాణం ధారపోసి
నీ కంటి నిద్రకు కావలుండే
అమరవీరుల మరవబోనని -- మాట ఇస్తావా

ఎదల పాదుల మొదలు నుంచి పుట్టే
మానవత్వపు లతయే మతము
లతను పెంచి సమత పంచే
తల్లి భారతి సేద దీర్చే
పందిరిగా నేనుందునంటూ -- మాట ఇస్తావా

ఎదల పాదుల మొదలు నుంచి పుట్టే
మానవత్వపు లతయే మతము
లతను తుంచి కలత పెంచే
మేక వన్నెల చిరుతనాపగా
ముళ్ళ పొదనై నే నుందునంటూ -- మాట ఇస్తావా

(1999 లో రాసింది)